Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీలకు కోవిడ్-19 టీకాలు వేయడానికి మార్గదర్శకాలు

గర్భిణీలకు కోవిడ్-19 టీకాలు వేయడానికి మార్గదర్శకాలు
, సోమవారం, 5 జులై 2021 (07:18 IST)
ఇకపై గర్భిణీలకు కూడా కరోనా టీకా వేయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) సిఫారసుల ఆధారంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత కరోనా వేరియంట్ల తీవ్రత నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ నుంచి గర్భిణీ మహిళలను మినహాయించడం సరికాదని రోగ నిరోధకతపై జాతీయ సాంకేతిక సలహా బృందం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల గర్భవతులు కరోనా బారిన పడే ముప్పు తప్పుతుందని మే 28న జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. టీకాల వల్ల వాటిల్లే రిస్క్‌ కన్నా జరిగే మేలు ఎక్కువని ఆ కమిటీ అభిప్రాయపడింది. 
 
 గర్భిణులకు టీకాలను ఇవ్వాలని  నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఐజి) సిఫార్సు చేసింది. టీకాల పర్యవేక్షణకు ఏర్పాటైన నిపుణుల బృందం కూడా ఈ సిఫార్సులను ఏకగ్రీవంగా ఆమోదించింది.

గర్భిణులకు టీకాలను ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా లాంటి నిపుణుల సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, స్వచ్చంధ సేవా సంస్థలతో సంప్రదింపులు జరిపింది.

వారి సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గర్భిణులకు టీకాలు వేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందించింది.
 
ఇప్పటి వరకు పాలిచ్చే తల్లులకు మాత్రమే కరోనా టీకాలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా గర్భణీలు కూడా వ్యాక్సినేషన్‌కు అర్హులేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గర్భిణీ మహిళలకు వ్యాక్సినేషన్‌ మంచిదేనని, వారికి తప్పని సరిగా టీకా వేయాలని సూచించింది. గర్భవతులు కొవిన్‌ పోర్టలో పేర్లు నమోదు చేసుకుని లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్‌ పొందవచ్చని ప్రకటించింది. 
 
గర్భంతో ఉన్న  సమయంలో కోవిడ్ -19 బారినపడితే వారి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుందని దీనివల్ల వారికి  తీవ్రమైన వ్యాధులు సోకే అవకాశం ఉండడమే కాకుండా కడుపులో ఉండే పిండంపై కూడా ప్రభావం చూపుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. దీనిపై అధ్యయనాలు నిర్వహించిన నిపుణులు సాధారణ మహిళలతో పోల్చి చూస్తే కోవిడ్-19 బారిన పడిన గర్భిణులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని గుర్తించారు. 
 
ఇంతేకాకుండా కోవిడ్-19 సోకిన గర్భిణులు ముందుగానే ప్రసవించడమే  కాకుండా ఇతర సమస్యలను ఎదుర్కోనే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని సమయాల్లో శిశువు మరణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. శిశు మరణాలను తగ్గించి, ముందస్తు ప్రసవాలను తగ్గించి గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు వారికి టీకాలను ఇవ్వాలని నిపుణులు సూచించారు. 
 
ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా  లాంటి నిపుణుల సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, స్వచ్చంధ సేవా సంస్థలతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపింది. గర్భిణులకు టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా అమలు చేయాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మార్గదర్శకాలను పంపింది. 
 
గర్భధారణ సమయంలో కోవిడ్-19 టీకాలు వేయడం:
 
* గర్భిణీలతోపాటు 18ఏళ్లు పైబడిన వ్యక్తులందరూ ఇప్పుడు కోవిడ్ టీకాలు తీసుకోవడానికి అర్హులు.
 
* గర్భిణీలు తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. దీంతో పిండంపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలకు కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్స్ చేయడం జరిగింది. 
 
కోవిడ్-19 సమస్యల ప్రమాదం ఉన్న గర్భిణీలు:
 
  *  35 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు
  *  ఊబకాయం
  *  డయాబెటీస్, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య లక్షణాలు ఉన్నవారు
  *  అవయవాల్లో గడ్డకట్టడం లాంటి పరిస్థితులు ఉన్నవారు
 
* గర్భిణీలు కోవిడ్ వ్యాక్సిన్ ను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. వీలైనంత త్వరగా తీసుకోవడం మంచిది.
 
* గర్భధారణ సమయంలో మహిళలు కోవిడ్ బారినపడినట్టయితే.. అలాంటి మహిళలు ప్రసవం తర్వాత టీకా తీసుకోవాలి.
 
* గర్భధారణ సమయంలో కోవిడ్ టీకా తీసుకోవడం సురక్షితం. సాధారణ లేక తేలికపాటి జ్వరం, ఇంజెక్షన్ వేసిన ప్రదేశం దగ్గర నొప్పి వంటి చిన్న చిన్న దుష్ప్రభావాలు 1 నుంచి 3 రోజులు ఉంటాయి.
 
* పిండం మరియు పిల్లల కోసం టీకా యొక్క దీర్ఘకాల ప్రతికూల ప్రభావాలు మరియు భద్రత ఇంకా నిర్ధారించబడలేదు. 
 
వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కూడా గర్భిణులు తప్పకుండా కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు శానిటైజ్‌ చేసుకోవడం లాంటివి మరచిపోకూడదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలంలో నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి : కెఆర్‌ఎంబికి తెలంగాణ లేఖ