Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా పరీక్షల కోసం బారులు తీరుతున్న బాధితులు: ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు

Advertiesment
Victims
, శుక్రవారం, 7 మే 2021 (15:09 IST)
కరోనా సెకండ్ వేవ్ తీవ్రదశలో ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసులు 20శాతం దాటిపోయింది. కోవిడ్ ను నియంత్రించడంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ విధానం కీలకమైనది. ప్రస్తుతానికి దేశంలో రోజువారీ కరోనా పరీక్షల సంఖ్య 15లక్షలకుపైగా ఉంటోంది.

కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు టెస్టుల కోసం వస్తుండటంతో ల్యాబ్ లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2506 మాలిక్యులర్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఇందులో ఆర్టీపీసీఆర్, ట్రునాట్, సిబినాట్ మరియు ఇతర రకాల పరీక్షలు చేయవచ్చు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయంతో పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు.

ఒకసారి నెగెటివ్ వచ్చిన తరువాత కూడా రిజల్ట్ తప్పేమో అనే ఆలోచనతో మరో కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కనిపిస్తోంది. దీంతో ల్యాబ్‌ల ముందు క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో శాంపిల్ కలెక్షన్.. పరీక్షలు.. ఫలితాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా ప్రయాణాలకు పరీక్షలు తప్పనిసరి కావడమూ ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా తాము ప్రయాణించడం కోసం టెస్ట్ లు చేయించుకోవాలని వస్తున్నారు. ఈ పరిస్థితులు నివారించడానికి, ల్యాబ్‌ల మీద ఒత్తిడి తగ్గించడానికి ఐసీఎంఆర్ కొన్ని కీలక సూచనలు చేసింది.
 
జాతీయ వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కరోనా పరీక్షలపై కొత్త మార్గదర్శకాలు
 
* ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) లేదా RT-PCR ద్వారా ఒకసారి పరీక్షించిన తర్వాత మరోసారి  RT-PCR పరీక్ష అవసరం లేదు.
 
* కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో ఎటువంటి పరీక్ష అవసరం లేదు.
 
* అంతర్రాష్ట్ర ప్రయాణాల సమయంలో కోవిడ్ లక్షణాలు లేనివారికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు. తద్వారా కోవిడ్ ల్యాబ్స్ పై కొంతైనా భారం తగ్గించవచ్చు.
 
* కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా వైరస్ లక్షణాలు ఉన్నవారు అంతర్ రాష్ట్ర ప్రయాణాలు తగ్గించాలి.
 
* కోవిడ్ లక్షణాలు లేని వ్యక్తులు కూడా ప్రయాణాల సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
 
* మొబైల్ పరీక్షా వాహనాల వివరాలు జీఈఎం పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రాలు ఈ మొబైల్ వాహనాల ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచడానికి ప్రోత్సహించాలి.
 
కరోనా పరీక్షల సామర్థ్యం పెంపు
అలాగే ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కోవిడ్, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్ (ఆర్.ఎ.టి) బూత్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలు వీలైనంత త్వరగా వస్తాయని.. తద్వారా కరోనా కేసులను గుర్తించడం సులువు అవుతుందని తెలిసింది. 
 
అదనపు సూచనలు:
* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచన
* అన్ని ఆర్టీపీసీఆర్ మరియు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ల ఫలితాలను https://cvstatus.icmr.gov.in లో తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణ భయంతో పరాయి రాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబు: మంత్రి పేర్ని నాని