మన దేశ ప్రధానమంత్రి పేరు ఏంటని మరదలు (వధువు చెల్లి) అడిగిన ప్రశ్నకు వరుడు సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో ఆ వధువు మరికొన్ని క్షణాల్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు, ఆహ్వానితులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆ వధువు వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివశంకర్ (27) అనే యువకుడికి జూన్ 11న రంజన అనే యువతితో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. జూన్ 12న ఉదయం.. పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది.
ఆ సమయంలో శివశంకర్ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరని మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్ సమాధానం చెప్పలేకపోయాడు. ఇది చూసిన వధువు బంధువులు అతణ్ని హేళన చేశారు.
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. రంజన కంటే అనంత్ వయసులో చిన్నవాడు కావడం గమనార్హం. అయినప్పటికీ ఆమె పట్టుబట్టి అతన్నే పెళ్లి చేసుకుంది. వధువు చర్యతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.