Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్ లో వెల్లివిరిసిన సౌభ్రాతృత్వం

Advertiesment
గుజరాత్ లో వెల్లివిరిసిన సౌభ్రాతృత్వం
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:34 IST)
మంచితనం నిండిన మానవతామూర్తులు మన మధ్యలోనే ఉన్నారేమో. ఏ మతమైనా ఏం చెబుతుంది. సాటి మనిషికి సాయపడమనేగా. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే కనిపించని ఆ దేవుడైనా కరుణిస్తాడేమో. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మారణకాండకు దారి తీస్తున్న సంఘటనల నేపథ్యంలో చంద్రునికో నూలి పోగులా.. అక్కడక్కడా జరిగే కొన్ని సంఘటనలు హృదయాలను తాకుతుంటాయి.
 
గుజరాత్ ఆమ్రేలి జిల్లాలో శవర్ కుండ్లా పట్టణానికి చెందిన భాను శంకర్ పాండ్యాకు, ముస్లిం సోదరుడు భిఖు ఖురేశీకి మధ్య నలభై ఏళ్ల స్నేహబంధం ఉంది. భాను శంకర్‌కి కుటుంబం లేదు. దాంతో ఎక్కువ సమయం ముస్లిం స్నేహితుడి ఇంట్లోనే గడిపేవారు. స్నేహితుని కొడుకులు అబు, నజీర్, జుబేర్ ఖురేశీ‌లు కూలీలుగా జీవనం సాగిస్తుండేవారు. వాళ్లు కూడా భాను శంకర్‌ పట్ల ప్రేమా ఆప్యాయతలను కనబరచే వారు.

వీరి స్నేహాన్ని పరాగ్ త్రివేది, ఆమ్రేలీ జిల్లా బ్రహ్మ సమాజ్ కొనియాడింది.  కొంత కాలానికి ఖురేశీ అనారోగ్యంతో మరణించారు. ప్రాణ స్నేహితుడి మరణం భాను శంకర్‌ని కలచి వేసింది. వారి కుటుంబంతో రాక పోకలు మాత్రం అలాగే ఉన్నాయి.

ఖురేశీ మనవళ్లు, మనవరాళ్లు శంకర్‌ని తాతా అంటూ ఆప్యాయంగా పిలిచే వారు. అయితే ఈ మధ్య శంకర్ కాలికి గాయం కావడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడని  ఖురేశీ కొడుకులు తమ ఇంట్లోనే ఉండమని చెప్పారు.
 
అందుకు శంకర్ కూడా ఆనందంగా ఒప్పుకుని వాళ్ల ఇంట్లోనే రోజులు గడుపుతున్నారు. తాను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిని అన్న విషయాన్ని పక్కన పెట్టి వారితో కలిసి మెలిసి ఉండేవారు. వారు ఆయనకోసం ప్రత్యేకంగా వండిన వెజిటేరియన్ వంటకాల్నే తినేవారు.

ఈ క్రమంలో శంకర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు ఖురేశీ కొడుకులు. అందుకోసం అంతిమ యాత్ర సమయంలో ధోతీ కట్టుకుని, జంధ్యం వేసుకున్నారు. హిందూ.. ముస్లిం భాయీ.. భాయీ.. మానవత్వానికి మతం అడ్డుకాదోయి అని మరోసారి నిరూపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్యాకేజీ