ప్రముఖ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ అగ్రనేత రియాజ్ నయ్‌కూను భారత సైన్యంమట్టుబెట్టింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆయనను భద్రతా బలగాలు హతమార్చాయి.
నిజానికి రియాజ్ ఉగ్రవాదంవైపు ఆకర్షితులు కాకముందు.. ఓ లెక్కల మాస్టారు. ఓ రైతు కుటుంబంలో జన్మించిన రియాజ్... పుల్వామాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అనంతరం ఓ ప్రైవేటు పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేశాడు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల కేసులో 2010లో బలగాలు అరెస్టయ్యారు. రెండేళ్ళ జైలు జీవితం తర్వాత 2012లో విడుదలయ్యాడు. భోపాల్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంటానంటూ 2012 మే 21న రియాజ్ తన తండ్రి వద్ద రూ.7 వేలు తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్లో చేరి కరుడుగట్టిన ఉగ్రవాదిగా తయారయ్యాడు. ఈ క్రమంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థలో చేరాడు. 2016లో శోపియాలో ఓ ఉగ్రవాది అంత్యక్రియల్లో రియాజ్ ప్రత్యక్షమయ్యాడు. మరణించిన ఉగ్రవాదికి నివాళిగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
తొలినాళ్లలో హిజ్బుల్‌లో చాలావరకు తెరవెనుక కార్యకలాపాలకే నాయకూ పరిమితమయ్యేవాడు. తదనంతర పరిణామాల్లో 2017లో అతడు హిజ్భుల్ పగ్గాలు చేపట్టి, క్షేత్రస్థాయి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా తన తల్లిని చూసేందుకు జమ్మూకాశ్మీర్‌కు వచ్చిన రియాజ్... భద్రతాబలగాల చేతిలో హతమయ్యాడు.