ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలో ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి తన ప్రియుళ్లతో పారిపోయారు. ఇక్కడ వింత ఏముందన్న సందేహం కలగవచ్చు. ఇక్కడే అసలు కిటుకు వుంది. ఈ జిల్లాలో భూమి ఉన్న నిరుపేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు అందజేస్తుంది. తొలి విడత రూ.50 వేలు, రెండో విడతలో రూ.1.50 లక్షలు, మూడో విడతలో రూ.50 వేలు చొప్పున డబ్బు పంపిణీ చేస్తుంది.
అయితే, ఇటీవల బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్దిదారులుగా అధికారులు ఎంపిక చేశారు. వీరిలో కొందరి ఖాతాల్లోకి రూ.50 వేలు జమ చేశారు. ఖాతాల్లో నగదు జమ కాగానే ఐదుగురు మహిళలు తమ భర్తలకు టాట్ చెప్పేసి ప్రియుళ్ళతో కలిసి వెళ్లిపోయారు. దీంతో ఆ మహిళల భర్తలు అధికారులను సంప్రదించి.. తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ భార్యలు వారి ప్రియుళ్ళతో వెళ్లిపోయారని, అందువల్ల రెండో దఫా నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భార్యల ఖాతాల్లో జమ చేయొద్దని బాధిత భర్తలు అధికారులను వేడుకొంటున్నారు.