Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

Advertiesment
ap singh

ఠాగూర్

, ఆదివారం, 10 ఆగస్టు 2025 (14:58 IST)
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో శత్రుదేశం పాకిస్థాన్‌కు గుట్టి గుణపాఠం చెప్పినట్టు భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్‌‍ సిందూర్‌లో భాగంగా, పాకిస్థాన్‌కు చెందిన ఆరు విమానాలను కూల్చివేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో ఐదు ఫైటర్ జెట్లతో పాటు అత్యంత కీలకమైన నిఘా విమానం (అవాక్స్ తరహాది) కూడా ఉందని తెలిపారు.
 
బెంగళూరులో జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం. కాత్రే స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించినట్టు ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని, వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
 
ఈ ఆపరేషన్‌లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. "మా ఎస్-400 వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. దాని పరిధి కారణంగా పాక్ విమానాలు మా గగనతలంలోకి చొచ్చుకురాలేకపోయాయి. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోనే ఒక భారీ నిఘా విమానాన్ని కూల్చివేశాం. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించి సాధించిన అతిపెద్ద విజయం ఇదే" అని ఆయన పేర్కొన్నారు. 
 
ఉగ్రవాద శిబిరాలపై దాడులు ఎంత ఖచ్చితత్వంతో జరిగాయో తెలిపేందుకు, దాడులకు ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలను ఆయన ప్రదర్శించారు. జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రధాన కార్యాలయమైన బహవల్పూర్‌పై జరిపిన దాడిలో పక్కనున్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేశామని ఆయన స్పష్టం చేశారు.
 
నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఐఏఎఫ్‌తో పాటు ఆర్మీ, నేవీ కూడా సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, ఇతర అధునాతన ఆయుధాలను సమర్థంగా ఉపయోగించడంతో పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. "ఇది కేవలం ప్రతీకార దాడి మాత్రమే కాదు.. ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యం, నిర్దిష్ట లక్ష్యంతో చేసిన ఆపరేషన్" అని ఎయిర్ చీఫ్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం