గతంలో ముంబైలోని ఓ కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు. మంటలు చెలరేగిన సమయంలో ఆస్పత్రిలో ఉన్న 27 మంది రోగులను మరో ఆస్పత్రికి తరలించినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
నాగ్‌పూర్ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆస్పత్రిలో 30 పడకలు ఉండగా అందులో 15 ఐసీయూ పడకలు ఉన్నాయి. ఆస్పత్రి రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ యూనిట్ నుంచి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి. మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు.
అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు. ఆస్పత్రిలో కొవిడ్ రోజులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ కట్టడికి అక్కడ నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్స్ కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పలుచోట్ల కోవిడ్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల భారీ ప్రాణనష్టం జరిగింది.
గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.