కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఒక మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన భార్యను హత్య చేసిన ఆరు రోజుల తరువాత పోలీసులకు పట్టుబడతానన్న భయంతో నిందితుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు రైలు పట్టాల వద్ద స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లా కడూర్‌లో ఓ మహిళ తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. హతురాలి పేరు కవిత. తన భర్త డాక్టర్ రేవంత్, పిల్లలతో కలిసి కడూర్‌లో నివసిస్తున్నారు. రేవంత్ దంత వైద్యుడు. కడూర్ సమీపంలోని బిరూర్‌లో క్లినిక్‌ను నడుపుతున్నాడు. రేవంత్, కవితలకు ఏడేళ్ల కిందట వివాహమైంది. కవిత స్వస్థలం ఉడుపి. వివాహం అనంతరం దంపతులు కడూర్‌లో నివసిస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన కవిత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. గొంతు కోసి హత్య చేశారు. తొలుత ఈ హత్యను దోపిడీ దొంగలు చేసి ఉండొచ్చని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ దోపిడీ దొంగలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనడానికి పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. హతురాలి ఇల్లు ప్రధాన రహదారికి ఆనుకునే ఉండటం, 24 గంటలూ వాహనాల రాకపోకలు సాగించే చోట దోపిడీ దొంగలు ఈ దారుణానికి పాల్పడే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో దర్యాప్తు తీరును మార్చారు. కుటుంబ సభ్యుల మీద నిఘా వేశారు.
కవిత పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు కవితకు నిద్రను తెప్పించే ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఈ నివేదికలో తేలింది. దీంతో పోలీసులు డాక్టర్ రేవంత్‌పై నిఘా వేశారు. పలుమార్లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. అయినప్పటికీ ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించలేకపోవడంతో అతడిని అరెస్టు చేయలేకపోయారు. పోస్టుమార్టంలో వారి అనుమానాలు నిజమయ్యాయి. ఇంజెక్షన్ ఇచ్చే సామర్థ్యం వైద్యుడిగా రేవంత్‌కి ఉండటంతో అతణ్ని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అరెస్టు భయంతో ఆత్మహత్యకు చేసుకున్నాడు. నిన్న ఉదయం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తన భార్యను డాక్టర్ రేవంత్ హత్య చేయడానికి అక్రమ సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా రేవంత్.. తను అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్న మహిళతో గడిపాడని తేలింది. ఈ విషయం కవితకు తెలియడంతో ఆమె నిలదీసిందని, అప్పటి నుంచి వారి మధ్య మూడు రోజుల పాటు ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. దీనితో విసుగెత్తిపోయిన రేవంత్.. తన భార్యను గొంతు కోసి హత్య చేశాడని, అనంతరం దాన్ని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని వెల్లడించారు.