ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వం ఔట్.. సీఎం అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో శశికళతో పాటు... ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రి
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పులో శశికళతో పాటు... ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించింది. దీంతో శశికళ ముఖ్యమంత్రి పీఠంపై పెట్టుకున్న ఆశలు అడియాశలై పోయాయి. దీంతో తన వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. కూవత్తూరు రిసార్ట్స్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలంతా తమ శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. అదేసమయంలో పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు.
ఇదిలావుండగా, మరికొన్ని గంటల్లో జైలు ఊచలు లెక్కించేందుకు వెళ్లనున్న శశికళ... రాజకీయంగా కాస్తయినా తన పట్టు నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సీఎం పీఠం తనకు దూరమైనప్పటికీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్ సెల్వానికి మాత్రం దక్కకూడదనే పట్టుదలతో ఆమె వ్యవహరిస్తున్నారు. అందుకే తనకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే, రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయనకు అండగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.