శశికళను దోషిగా ప్రకటించడం చారిత్రాత్మకం : ఎంకేస్టాలిన్
జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతి
జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 'రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత న్యాయం జరిగింది. ఇది చారిత్రాత్మక తీర్పు' అని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో రాజకీయ నేతలు ఎలాంటి ప్రవర్తనతో నడుచుకోవాలో సుప్రీం తీర్పు మార్గనిర్దేశనం చేసిందన్నారు.
"అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలెవ్వరూ ఎవరూ తప్పించుకోలేరని ఈ తీర్పు చాటిచెప్పింది. ప్రజాజీవితంలో నిజాయితీ చాలా అవసరం. రాజకీయ నేతలందరికీ ఇదో గొప్ప గుణపాఠం" అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పీఠానికి జరిగే బలపరీక్షలో డీఎంకే వైఖరి ఏమిటని కోరగా... 'డీఎంకే ఎల్లప్పుడూ దేశ ప్రయోజనం వైపే నిలబడుతుంది' అని సమాధానమిచ్చారు.