సాధారణంగా వైన్ షాపుల నిర్వహణను వేలం పాట పాడి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటుంటారు. అలా, ఒక వైన్ షాపు ధర మహా అయితే రూ.10 కోట్లు పలుకుతుంది. కానీ, ఆ వైన్ షాపు వేలం పాట ధర ఏకంగా 150 కోట్ల రూపాయలు పలికింది. ఈ వైన్ షాపు వేలం పాట ఏకంగా 15 గంటల పాటు సాగింది. ఈ నోరెళ్లబెట్టే ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఈ వైన్ షాపు వేలం పాట ప్రారంభ ధర రూ.72 లక్షల నుంచి మొదలై రూ.150 కోట్ల వద్ద ఆగింది. ఈ ధర వింటే ఏ ఒక్కరూ నమ్మడం లేదు. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం వైన్‌షాప్‌లను లాటరీలో కాకుండా వేలం వేయాలని నిర్ణయించారు.
ఇది అక్కడి ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపించింది. అక్కడి హనుమాన్‌గఢ్ జిల్లా నోహర్‌లోని ఓ వైన్‌షాప్‌కు ఈ-వేలం వేశారు. కిందటిసారి లాటరీలో కేవలం రూ.65 లక్షలకే పోయిన ఈ వైన్‌షాప్ ఈసారి మాత్రం కళ్లు తిరిగే మొత్తాన్ని సొంతం చేసుకుంది. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ఈ-వేలం అర్థరాత్రి 2 గంటలకు ముగిసింది. చివరికి రూ.510 కోట్ల ధర పలకడం విశేషం.
కిరణ్ కన్వర్ అనే వ్యక్తి ఈ షాప్‌ను సొంతం చేసుకున్నట్లు ఎక్సైజ్ పాలసీ అడిషనల్ కమిషనర్ సీఆర్ దేవసి వెల్లడించారు. బేస్‌ప్రైస్ కంటే ఇది ఏకంగా 708 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మూడు రోజుల్లో ఈ బిడ్డింగ్ మొత్తంలో రెండు శాతాన్ని బిడ్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు చెల్లించలేకపోతే రూ.లక్ష డిపాజిట్‌ను తిరిగి ఇవ్వరు. అలాగే, చురు జిల్లాలోని ఓ వైన్ షాప్ రూ.11 కోట్లకు, జైపూర్‌లోని సాంగనర్ వైన్‌షాప్ రూ.8.91 కోట్లు పలికాయి.
ఇదిలావుంటే ఈ వైన్ షాపు ఇంత ధర పలకడానికి కారణం ఇరు కుటుంబాల మధ్య ఉన్న వైరమే. ఈ వైన్ షాప్ కోసం ప్రియాంకా కన్వర్ అనే మరో మహిళ కూడా పోటీ పడింది. ఈ ఇద్దరూ పోటా పోటీగా వెళ్లడంతో చివరికి అది రికార్డు ధర పలికింది.