అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ చైర్‌పర్సన్, సీనియర్ అంకాలజిస్టు డాక్టర్ వీ శాంత (94) తుదిశ్వాస విడిచారు. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఉచితంగా సేవలందించిన శాంత వైద్య వృత్తికి వన్నె తెచ్చారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీవ్ర ఛాతీ నొప్పికి గురైన ఆమెను కుటుంబ సభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంత భౌతికకాయాన్ని పాత క్యాన్సర్ దవాఖాన ఆవరణకు తరలించారు.
ఈ దవాఖానను ఆమె తన గురువు డాక్టర్ కృష్ణమూర్తితో కలిసి నిర్మించారు. దేశవ్యాప్తంగా పేదలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో డాక్టర్ శాంత ఎనలేని కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆమె సహాయ సహకారాలు అందించారు.