ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు భార్యకు కేన్సర్ సోకిందని తెలుసుకున్నాడు. ఆ వ్యాధిని నయం చేసేందుకు డబ్బు వృధాగా ఎందుకు ఖర్చు చేయడమని భావించాడు. అంతే.. అతను తన భార్యను చంపి, ఆ తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు.
ఇంతకాలం కలిసి జీవించాం.. ఇపుడు కలిసే చనిపోతున్నాం అంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు. ఆ వ్యాపారి పేరు కుల్దీప్ త్యాగి. వయసు 46 యేళ్లు. ఈయన ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా, కేన్సర్ సోకిందని తేలింది. చికిత్స చేయించుకున్నా పూర్తిగా నయమవుతుందని గ్యారంటీ లేదని తెలుసుకున్నాడు. పైగా చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తనువు చాలించాలని త్యాగి నిర్ణయించుకున్నాడు.
అయితే, ఎల్లవేళలా కలిసే ఉంటామని భార్య అన్షు త్యాగికి చేసిన ప్రామిస్ గుర్తుకు వచ్చింది. దీంతో ఇంట్లోని లైసెన్స్డ్ రివాల్వర్‌తో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పనికి పాల్పడేముందు ఆయన ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టాడు.
కేన్సర్ నుంచి కోలుకోవడం అసాధ్యమనే ఉద్దేశ్యంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కుల్దీప్ త్యాగి పేర్కొన్నాడు. తన ఇద్దరు కొడుకుల విషయంలో తప్పుపట్టవద్దని కోరారు. త్యాగి కుమారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.