మామూలుగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి.
అలా కూర్చోవడం ద్వారా అవి తమ కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. అది అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం.
దానికి కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నులుచుని ఉన్నప్పుడు మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యం ఉంది.
అందువల్ల అది మిగతా జంతువుల లాగా తన కాళ్లను ముడుచుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అంతేకాదు అది నిలబడి నిద్రపోగలదు కూడా. ఒకోసారి నేలపై పూర్తిగా ఒక పక్కకు ఒరిగి పడుకుంటుంది.