దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇక్కడ ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అయితే, ఈ రాష్ట్ర అధికారులు గాడిదలు, గుర్రాల కోసం వేట ప్రారంభించారు.
తేని జిల్లాలో పశ్చిమ కనుమలకు చేరువగా 30కిపైగా చిన్నిచిన్న గిరిజన గ్రామాలున్నాయి. వాహనాలు అక్కడికి వెళ్లేందుకు అనువైన రోడ్డు సౌకర్యం లేకపోవడం ఇప్పుడు అధికారుల పీకలమీదికి వచ్చింది. ఈ గ్రామాల్లో దాదాపు పదింటికి అసలు రోడ్డే లేదు. దీంతో గిరిజనులు కాలి బాటనే నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడికి పోలింగ్ సామగ్రిని తరలించి ఎన్నికలు నిర్వహించడం ఎలాగన్న విషయంలో అధికారులకు పెద్ద చిక్కొచ్చిపడింది. దీంతో గాడిదలు, గుర్రాల ద్వారా పనికానివ్వాలని నిర్ణయించారు. వాటి ద్వారా మాత్రమే ఎన్నికల సరంజామాను తరలించడం వీలవుతుందని భావిస్తున్న అధికారులు గుర్రాలు, గాడిదల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
అధికారులకు అవసరమైన ఫర్నిచర్, ఈవీఎంలు, నీళ్ల సీసాలు, అట్టపెట్టెలు తదితర వాటిని తరలించేందుకు గాడిదలు, గుర్రాలను అద్దెకు తీసుకోమంటూ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. దీంతో తేని జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బంది వాటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.