Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీసులో నిద్రపోతే.. అది దుష్ప్రవర్తనే.. చర్య తీసుకోవచ్చు : కేంద్రం

ఆఫీసులో నిద్రపోతే.. అది దుష్ప్రవర్తనే.. చర్య తీసుకోవచ్చు : కేంద్రం
, ఆదివారం, 3 జనవరి 2021 (09:53 IST)
అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరై హాయిగా నిద్రపోతుంటారు. ఇలాంటి వారికి ఇకపై కష్టాలు తప్పవు. ఆఫీసు పని వేళలో నిద్రపోతే అది దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం ఓ ముసాయిదాను కూడా తయారు చేసింది. 
 
ఈ ముసాయిదా తయారీలో భాగంగా, ప్రజలు, వివిధ సంఘాల అభిప్రాయాలు, సూచనలు కోరింది. ఇందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. మొత్తం 23 వ్యవహారాలు దుష్ప్రవర్తనేనని, పేర్కొంటూ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లోని సెక్షన్ 29లో స్టాండర్డ్ ఆర్డర్స్‌ను జారీ చేసింది. ఈ దిశగా నోటిఫికేషన్‌ను జారీ చేసిన కార్మిక శాఖ, సేవలకున్న ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 
 
కాగా, ఉద్యోగుల విషయంలో ఈ విధంగా నిబంధనల ముసాయిదా తయారు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉద్యోగి ప్రవర్తన సరిగ్గా లేకుంటే, విచారణ పూర్తికాకుండానే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం లభిస్తుంది. నియామకం సమయంలో ఉద్యోగికి, యజమాని మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం పని గంటలు ఉంటాయని కూడా కార్మిక శాఖ స్పష్టం చేసింది.
 
ఇక దుష్ప్రవర్తన కిందకు వచ్చే అంశాల్లో దొంగతనం, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడటం, మోసం, స్వీయ ప్రయోజనాల కోసం లంచాలు ఇవ్వడం, తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా ఎదురు మాట్లాడటం, చెప్పిన మాట వినకపోవడం ఉన్నతాధికారుల ఆదేశాలు ధిక్కరించడం, విధులకు ఆలస్యంగా రావడం, సెలవు తీసుకోకుండా గైర్హాజరు వంటి వాటిని చేర్చారు. 
 
వీటితో పాటు తరచూ గైర్హాజరు, మద్యం తాగి విధులకు రావడం, అమర్యాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం, యజమాని ఆస్తికి నష్టం కలిగించడం, నిద్రపోవడం, నెమ్మదిగా పనిచేయడం వంటి వాటిని కూడా చేర్చారు.
 
అంతేకాదు... లేని జబ్బు ఉన్నట్టు నటించడం, కింది ఉద్యోగుల నుంచి బహుమతులు తీసుకోవడం, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం, అనుమతి తీసుకోకుండా లేదా స్పష్టమైన కారణం లేకుండా 10 రోజులకు మించి సెలవు పెట్టడం, ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, కారణం లేకుండా పని వదిలివెళ్లడం, పై అధికారులను బెదిరించడం, హింసకు పురిగొల్పేలా మాట్లాడటం, 14 రోజుల నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగడం వంటి వాటిని కూడా జోడించారు.
 
రహస్య సమాచారాన్ని బయటి వారికి చెప్పడం, చార్జ్‌షీట్ లేదా నోటీసులను ఉద్దేశపూర్వకంగా స్వీకరించక పోవడం, భద్రతా పరికరాలను ధరించకపోవడం లేదా తిరస్కరించడం, వివిధ రకాల రీయింబర్స్‌మెంట్ కోసం తప్పుడు బిల్లులు పెట్టడం వంటి వాటన్నింటినీ దుష్ప్రవరివర్తన కింద జోడిస్తూ కార్మిక శాఖ ముసాయిదాను తయారు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా స్ట్రెయిన్ - 30 దేశాల్లోకి ఎంట్రీ