ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఇంటికి వస్తే పెన్షన్ మంజూరు చేస్తానంటూ నమ్మించి ఓ మహిళను రేప్ చేశారు. సదరు శాసనసభ్యుడు పేరు మోహిందర్ గోయల్. ఈ మేరకు బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రశాంత్ విహార్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన 40 యేళ్ళ మహిళకు కొన్నెల్ల కిందట భర్త చనిపోయాడు. ఈమె భర్తకు స్థానిక ఎమ్మెల్యే మొహిందర గోయల్ పరిచయం. ఆ పరిచయంతో తన భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ మంజూరు చేయాలని బాధిత మహిళ ఎమ్మెల్యేను సంప్రదించింది.
దీంతో గోయల్ ఆ మహిళను ఇంటికి పిలువగా ఆమె ఒక్కటే ఇంటికి వెళ్లింది. అపుడు తన పడక గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో... '2008లో నా భర్త చనిపోయాడు. గత ఏడాది డిసెంబర్‌లో పెన్షన్ విషయమై ఎమ్మెల్యేను కలిశాను. దీంతో ఇంటికి రావాల్సిందిగా ఆయన సూచించాడు. ఇంటికి వెళ్లిన నాపై ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు' అని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నెలరోజులకు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన తనపై మోహిందర్ మరోసారి అత్యాచారం జరిపాడని, దీంతో తాను అప్పట్లో స్థానిక పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు.
అయితే, జరిగిన తప్పునకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాడని, దీంతో విషయాన్ని క్లిష్టతరం చేయడం ఇష్టంలేక తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. కానీ గత నెలలో ఎమ్మెల్యే సోదరుడు తనను బెదిరిస్తూ.. తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌కు పంపాడని, ఎమ్మెల్యే అఘాయిత్యం గురించి బయటకు చెబితే.. వాటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తానని హెచ్చరించాడని, దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు సేకు నమోదు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకు సమర్పించనున్నారు.