Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో ఆటో డ్రైవర్లకు అరవింద్ ఆపన్నహస్తం!

ఢిల్లీలో ఆటో డ్రైవర్లకు అరవింద్ ఆపన్నహస్తం!
, మంగళవారం, 4 మే 2021 (17:01 IST)
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న హస్తినలోని ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెల్సిందే. ఈ ఆంక్షలను మే 10వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో పేదలు, బలహీనవర్గాలను ఆదుకునేందుకు ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులోభాగంగా వచ్చే రెండు నెలలపాటు రేషన్‌ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ ఉచిత రేషన్‌ అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. 
 
దీని ద్వారా దాదాపు 72 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇలా ఇస్తున్నప్పటికీ రెండు నెలలు వరకు లాక్డౌన్‌ ఉండదని కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. పేదలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
 
లాక్డౌన్‌ వల్ల ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వెల్లడించారు. సంక్షోభ సమయంలో ఆర్థికంగా వారికి కొంత ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 
 
గతేడాది లాక్డౌన్‌ విధించిన సమయంలోనూ వీరికి ఢిల్లీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. దీనివల్ల దాదాపు లక్షన్నర మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లబ్ధిపొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
 
మరోవైపు, ఢిల్లీలో లాక్డౌన్‌ విధించినప్పటికీ కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 18 వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. రోజువారీ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కొవిడ్‌ మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 
 
సోమవారం ఒక్కరోజే 448 మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల సంఖ్య 400 నమోదుకావడం వరుసగా ఇది మూడోరోజు కావడం ఆందోళనకర విషయం. ఇప్పటివరకు దిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 17వేలు దాటింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని వైపుల నుంచి ఈటలకు కేసీఆర్ ఉచ్చు: హైకోర్టుకు మాజీమంత్రి