ముఖ్య అతిథిగా వచ్చి ప్రిన్సిపాల్‌కు అపరాధం విధించిన కలెక్టర్!!

సోమవారం, 21 అక్టోబరు 2019 (17:54 IST)
ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ, తనకు ఇచ్చే పూలబొకేలను నిషేధిక ప్లాస్టిక్ కవర్లలో తీసుకరావడాన్ని చూసిన ఆయన ఆగ్రహం చెందారు. అంతటితో శాంతించని ఆయన... ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు రూ.వెయ్యి అపరాధం విధించారు. ఈ చర్యతో పాఠశాల సిబ్బందితో పాటు.. విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భింద్ జిల్లాలో అటవీ శాఖతో కలిసి ఓ ప్రభుత్వ కాలేజీలో ఓ కార్యక్రమం నిర్వహించగా, దీనికి జిల్లా కలెక్టర్ చోటే సింగ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కాలేజీ, పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులు హాజరయ్యారు. 
 
అయితే అతిథులను ఆహ్వానించేందుకు ఉద్దేశించిన పూలదండలను నిషేధిత ప్లాస్టిక్ బ్యాగుల్లో (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు) తీసుకురావడంతో కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అక్కడిక్కడే ఆయన అందరి ముందూ సదరు స్కూల్ ప్రిన్సిపల్‌‌కు రూ.1000 జరిమానా విధించారు.
 
ఊహించని ఈ పరిణామానికి ప్రిన్సిపాల్‌తో పాటు హాజరైన విద్యార్ధులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులపై దేశ వ్యాప్తంగా నిషేధం ఉందనీ.. వీటిని ఎలా ఉపయోగిస్తారంటూ కలెక్టర్ ప్రశ్నించడంతో ప్రిన్సిపాల్ నోట మాటరాలేదు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, విద్యార్థులకు ప్లాస్టిక్ బ్యాగులపై గట్టి సందేశం ఇచ్చేందుకే కలెక్టర్ ఇలా చేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ముగిసిన పోలింగ్ : హుజూర్ నగర్‌లో ఓటర్ల మూడ్ ఏంటి?