Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెలు కూడా కొడుకులతో సమానమే.. ఆస్తిలో హక్కుంది : సుప్రీంకోర్టు

Advertiesment
కుమార్తెలు కూడా కొడుకులతో సమానమే.. ఆస్తిలో హక్కుంది : సుప్రీంకోర్టు
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:55 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమారులతో పాటు.. కుమార్తెలకు కూడా సమాన ఆస్తి హక్కు ఉంటుందని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆడపిల్లలకు కొడుకులతో పాటు సమాన ఆస్తి హక్కు ఉంటుందని ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. 
 
హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని తెలిపింది. ఓ కేసులో బాధితురాలి తండ్రి 1999, డిసెంబర్ 11న మరణించారు. అయితే, ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు క‌ల్పించే హిందూ వార‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2005లో అమ‌ల్లోకి వ‌చ్చింది కాబట్టి, ఈ కేసులోని బాధితురాలికి ఆస్తిలో సమానహక్కు దక్కదని ప్ర‌తివాదులు వాదించారు.
 
అయితే, తండ్రికి ఆడపిల్ల ఉంటే చాలని, ఆస్తిలో వారికి సమానహక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005, సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఆడపిల్లకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు చెప్పింది. 
 
ప్రకాశ్ వర్సెస్ ఫూల్‌వతి కేసులో సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రాకముందు కుమార్తెలకు హక్కులు ఉండవు. దానమ్మ వర్సెస్ అమర్ కేసులో సుప్రీంకోర్టులోని వేరొక ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినప్పటికీ, ఆయన ఆస్తిలో ఆయన కుమార్తెకు హక్కు ఉంటుంది, ఆమె ఆ సమష్టి కుటుంబ సహభాగస్థురాలే. 
 
ఈ రెండు తీర్పులు విభిన్నంగా ఉండటంతో దీనిపై వివరణ కోరారు. దీంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరణ ఇచ్చింది. 'ఈ చట్టంలోని సెక్షన్ 6 ద్వారా కుమార్తెలకు కల్పించిన సమానత్వ హక్కును పోగొట్టరాదు' అని జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. 
 
2005 సెప్టెంబరు 9 నుంచి హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి వచ్చింది. తమ తండ్రి ఆస్తిలో తమ అన్నదమ్ములతో సమాన వాటా కోరే అక్కచెల్లెళ్ళ వ్యాజ్యాలను పరిష్కరించేందుకు ఈ తేదీనే కొలబద్దగా న్యాయస్థానాలు పరిగణిస్తున్నాయి. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న విచారణలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, సంఘంలో గౌరవం, కుటుంబంలో సమానత్వం వంటి విషయాల్లో మరొక ముందడుగు పడినట్టయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ ఆ విషయాన్ని గుర్తు చేసింది: ప్రధానితో ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్