బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ కారణంగా తుఫాను ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పైగా, తుఫాను ప్రభావంతో తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులుపడే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్, సిక్కింలలో రానున్న వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్‌లోని ఫిబ్రవరి 19, 20వ తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ లోపు రాజస్థాన్, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19, 20వ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.