అరేబియా సముద్రం మధ్యలో ఏర్పడిన షహీన్ తుపాను తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండి) శుక్రవారం పేర్కొంది. అంతకు ముందు ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది.
సాయంత్రం 5.30 గంటల సమయానికి అరేబియా సముద్రం వాయువ్య, ఈశాన్య ప్రాంతం మధ్య కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తదుపరి 12 గంటల్లో తుపాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, 36 గంటల్లో మాక్రాన్ తీరం వెంబడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, ఆ తరువాత పశ్చిమ-నైరుతి వైపుగా తిరుగుతుందని తెలిపింది.
అనంతరం ఒమన్ తీరం వైపుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి వెల్లడించింది. గులాబ్ తుపాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరం దాటిన వారం రోజుల తర్వాత ఈ షహీన్ తుపాను భారతదేశ తీరానికి దూరంగా వెళుతోంది. మత్స్యకారులు శనివారం వరకు ఆరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది.
ఇప్పటికే వెళ్లిన వారెవరైనా ఉంటే వెంటనే వెనక్కు వచ్చేయాలని సూచించింది. షహీన్ ప్రభావంతో ఆదివారం వరకు గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.