దోమ తెరల తయారీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శివస్వామి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దోమ తెరల మధ్య కోట్ల రూపాయలు నగదు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు.
దోమ తెరలను విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయల డబ్బులను ఐటీ రిటర్న్ ఎగవేస్తూ తప్పించుకు తిరుగుతున్న శివస్వామితో పాటు అతన్ని స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఐటీ అధికారులు.
నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాల్లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. శోభికా కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కరూర్ జిల్లా సెమ్మడై ప్రాంతంలో దోమ తెరల తయారీ పరిశ్రమల ఉంది. ఈ ప్రాంతం నుంచే విదేశాలకు దోమ తెరలు ఎగుమతి చేస్తున్నారు.
ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వాణిజ్యం జరుగుతోంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఐటీ రిటర్న్స్ ఎగవేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఐటీ అధికారులు కరూర్ జిల్లాలోని శివస్వామికి చెందిన నాలుగు కంపెనీలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.