పుదుచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల వయస్సున్న ఓ బాలుడు, 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. ఇంకా చెప్పాలంటే.. 25 ఏళ్ల ఆ యువతికి 27న వివాహం కూడా నిశ్చయమైంది. వివరాల్లోకి వెళితే.. ఓ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా వున్న యువతి.. ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది.
ఈ నెల 18వ తేదీన ఇంటి నుంచి మూలుగుల శబ్ధం వినిపించింది. పక్కింటి వారు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడివున్న యువతి ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీన్ని హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో యువతి ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు యువకులు కనిపించడంతో వారిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద జరిపిన విచారణలో 18వ తేదీన బాలుడి పావురం ఎగురుకుంటూ వెళ్లిందని.. అది ఎగురుకుంటూ పక్కింట్లోకి వెళ్లింది. దాన్ని తెచ్చుకునేందుకు యువతి ఇంట్లోకి బాలుడు వెళ్లాడు. అయితే ఎందుకు వచ్చావని యువతి కొట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడు.. బయటి నుంచి బండరాయి తెచ్చి.. యువతి తలపై బాదాడు.
స్పృహ కోల్పోయిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా గొంతుకోసి వెళ్లిపోయాడు. ఈ కేసులో బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి బాలనేరస్తుల కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.