దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో అనేక రాష్ట్రాల్లో అత్యంత విషాదకరరీతిలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో శ్మశానవాటికలన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. వీటిలో పనిచేసే కాటికాపరులు రేయింబవుళ్ళూ పని చేస్తున్నారు. ఏమాత్రం విరామం లేకుండా శ్మశానాలకు వస్తున్న మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలో శ్మశానవాటికల్లో పనిచేస్తున్న కాటికాపరులందరినీ కరోనా యోధులుగా గుర్తిస్తూ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న కాటికాపరులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వారియర్స్‌గా గుర్తించామని సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కాటికాపరులు శ్మశానవాటికలో విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేస్తామని సీఎం వెల్లడించారు.
దీంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరోనా బారిన పడితే వారి చికిత్సకు 'మా కార్డు', 'వాత్స్యల్య కార్డు'ల కింద ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని రూపానీ వెల్లడించారు.
కాగా, దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో కూడా నిత్యం 10వేలకు పైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో నిన్న 11,017 కరోనా కేసులు నమోదు కాగా.. 102 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మొత్తం సంఖ్య 7 లక్షలు దాటగా.. ఇప్పటివరకూ 8,731 మంది మరణించారు.