కరోనా వైరస్ సృష్టించిన కష్టాలకు అన్నీఇన్నీకావు. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. వలస కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. రోగుల పరిస్థితి మరింత దీనంగా మారింది. ఈ వైరస్ బారినపడినవారు పిట్టల్లా రాలిపోతున్నారు. విద్యార్థులు చదువులను కట్టేసి ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి కష్టాలు ఒక ఎత్తు అయితే, మరికొందరి కష్టాలు వర్ణనాతీతం. తన కుమారుడి పదో తరగతి సిప్లమెంటరీ పరీక్ష రాసేందుకు ఓ తండ్రి ఏకంగా 105 కిలోమీటర్లు తన సైకిల్‌పై తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాకు చెందిన శోభ్రామ్(38) అనే వ్యక్తి కూలిపనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు పదో తరగతి చదివే ఆశిష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. తన బిడ్డతో సిప్లమెంటరీ పరీక్ష రాయించేందుకు 105 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణించి పదోతరగతి పరీక్ష రాయించాడు.
శోభ్రామ్‌కు చదువంటే ప్రాణం. కానీ తన కుటుంబసమస్యల కారణంగా కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ తనలా తన కొడుకు ఆశిష్ కూలీలా కాకుండా ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకున్నాడు. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశిష్ ఫెయిల్ అయ్యాడు. అలా ఎవరైతే ఫెయిల్ అవుతారో అలాంటి వారి కోసం ప్రభుత్వం 'రుక్ జానా నహీ' అనే పథకాన్ని కానీ ప్రవేశపెట్టి పరీక్షలు నిర్వహిస్తోంది.
ఆ పథకం కింద ఆశిష్ పదోతరగతిలో ఫెయిల్ అయిన సబ్జెట్‌కు పరీక్షరాయిల్సి ఉంటుంది. ఇంటి నుంచి పరీక్షా కేంద్రం 105 కి.మీ దూరంలో ఉంది. రవాణా సౌకర్యం లేదు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లడానికి వారి దగ్గర డబ్బు లేదు, మోటార్ సైకిల్ ఇచ్చేవారు లేరు.
దీంతో శోభ్రామ్ తన కొడుకు ఆశిష్‌ను సైకిల్‌పై కూర్చోబెట్టుకొని సోమవారం ఉదయం తన గ్రామం నుంచి పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు. రాత్రి సమయంలో మనవార్ పట్టణంలో గడిపిన తర్వాత మంగళవారం పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అక్కడికి చేరుకున్నారు. కొడుకు చేత పరీక్ష రాయించాడు.
ఈ సందర్భంగా శోభ్రామ్ మాట్లాడుతూ నేను కూలి పనిచేస్తున్నా. నా కొడుకు నాలా కూలి పని చేసుకోకూడదు. కరోనా సమయంలో రవాణా సౌకర్యం లేదు. సైకిల్ మీద నా కొడుకును పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చి, పరీక్ష రాయించినట్టు చెప్పుకొచ్చాడు.