కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీలో పని చేసే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై పిడుగుపడింది. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుపెట్టుకుని ఏకంగా 600 మంది సిబ్బందిని అధికారులు తొలగించారు. వీరంతా కృష్ణా రీజియన్‌లో ఉండే 14 డిపోలకు చెందిన సిబ్బంది కావడం గమనార్హం. ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన యజమాన్యం ఇపుడు అర్థాంతరంగా బయటకు గెంటేస్తే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు.
నిజానికి కృష్ణా జిల్లా రీజియన్‌లోని ఆర్టీసీ గ్యారేజీల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యం దృష్టి ఈ రీజియన్‌పై పడింది. గ్యారేజీల్లో సగటున 40 మంది చొప్పున కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటువేసింది.
ఈ రీజియన్‌లో 14 డిపోలు ఉన్నాయి. విజయవాడ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, గుడివాడ, మచిలీపట్నం, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం, గవర్నర్ పేట-1, 2, ఆటోనగర్, గన్నవరం, ఉయ్యూరు బస్ డిపోల పరిధిలోని 600 మందికి పైగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టీసీ అధికారులు తొలగించారు. ఆఫీసుల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపైనా ఆర్టీసీ అధికారులు వేటు వేశారు.
దీంతో వీరంతా లబోదిబోమంటున్నారు. అసలే కరోనా దెబ్బకు ఆర్నెల్లుగా ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉంటే.. ఇపుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తమను మరింతగా కుంగదీసిందని వారు వాపోతున్నారు. ఇపుడు భార్యా పిల్లలను ఎలా పోషించుకోవాలని వారు విలపిస్తున్నారు.