ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ రెండో దశలో.. ప్రధాని నరేంద్రమోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు టీకా తీసుకోనున్నట్టు సమాచారం.
తొలి దశలో భాగంగా కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు, భద్రతా సిబ్బందికి టీకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రెండో దశలో 50 ఏళ్లు పై బడినవారికి టీకాలు ఇవ్వనున్నారు.
ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యధికులు 50 ఏళ్లు దాటినవారే కావడంతో వారంతా ఆటోమేటిగ్గా టీకా కార్యక్రమం పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే వారికి ఎప్పుడు టీకా ఇవ్వనున్నారనే విషయాన్ని వారు ధ్రువీకరించలేదు. కాగా.. టీకా కార్యక్రమం నిర్వహణ, సెషన్ ప్లానింగ్, స్టాకు పరిస్థితి వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వీలైనంత ఎక్కువ మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని జిల్లాల అధికారులనూ కోరింది.