కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో వుండగా.. ఏపీలో ప్రభుత్వం దిశ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ కొందరు మృగాల్లో మార్పు రావడం లేదు. ఇక కరోనా సోకిన మహిళలను కూడా కొందరు నీచులు వదలడం లేదు.
కరోనా సోకినా పర్వాలేదు.. కామవాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఓ ఆస్పత్రిలో ఇటీవలే 20 ఏళ్ల మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో నోయిడాలోని శర్ధ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. అక్కడ ఆమెకు కరోనా వున్నట్లు తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అయితే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను దారుణంగా లైంగికంగా వేధించడం ప్రారంభించారు. దీంతో సహించలేని సదరు మహిళ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.
మరోవైపు వారిని ఆస్పత్రి నిర్వహకులు విధుల నుంచి తొలగించారని తెలుస్తోంది. కాగా, ఇటీవలే ముంబైలో కరోనా వ్యాధికి గురైన మహిళపై ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.