కరోనా వైరస్ ఇపుడు భారత్‌ను పట్టిపీడిస్తోంది. ఇతర దేశాల్లో ఈ వైరస్ క్రమంగా తగ్గుముఖంపడుతుంటే.. మన దేశంలో మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అమెరికా రికార్డును భారత్ బద్ధలుకొట్టింది. శనివారం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 79 వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలను దాటింది.
గడచిన వారం రోజుల వ్యవధిలో దాదాపు 5 లక్షల కేసులు నమోదు కాగా, రోజుకు సగటున 70,867 కేసులు వచ్చాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో ఈ మహమ్మారి విజృంభించిన జూలై చివరి వారంతో పోలిస్తే, భారత్‌లో గతవారం నమోదైన కేసులే అధికం కావడం గమనార్హం.
ఇక శనివారం మహారాష్ట్రలో అత్యధికంగా 16,867 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో 27 లక్షల మందికిపైగా కోలుకోగా, 945 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనా తగ్గిందని భావించిన దేశ రాజధానిలోనూ ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 1,954 కొత్త కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.
మరోవైపు, తెలంగాణలో కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,924 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేసమయంలో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,638 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,090 కి చేరింది. ఆసుపత్రుల్లో 31,284 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 90,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 818కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి.