కరోనా వైరస్ కారణంగా.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్దస్మార్ట్ ఫోన్ మార్కెట్లు చైనా, ఇండియా. రెండుదేశాల్లో 260 కోట్లమందికి పైగా జనాభా వుంది. ఏమోడల్ డిజైన్ చేసినా రెండు దేశాల్లోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుంటాయి కంపెనీలు.
అలాంటి ఈ భారీ మార్కెట్లో అమ్మకాల తగ్గుదల భారీగా కనిపిస్తోందని తాజాగా ఓ సర్వేలో తేలింది. గత సంవత్సరం రెండో క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 20.4 శాతం తగ్గాయి. చైనాలో అమ్మకాలు ఏడు శాతం, ఇండియాలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 46 శాతం తగ్గినట్లుగా ఆ సర్వే తెలిపింది. ఉన్నంతలో అమ్మకాల పరంగా మొదటి స్థానంలో శామ్‌సంగ్ నిలవగా తదుపరి స్థానాల్లో హువావే, ఆపిల్, షావోమీ, ఒప్పోలు ఉన్నాయి.
అయితే చైనాలో పరిస్థితులు చక్కబడుతున్నకొద్దీ డిమాండ్ రికవరీ అవుతోందని తెలుస్తోంది. ప్రయాణాలపై ఆంక్షలు పెట్టడం, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు తగ్గడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్ పడిపోయాయని వివరించారు.
జనం ఆహారం, పోషకాహారం, వైద్యం వంటి అత్యవసరమయిన వాటికే ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. చైనా వస్తువులపై భారత్ నిషేధం విధించడంతో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివిధ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌ల అమ్మకాలు తగ్గాయి.