Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షమాపణ చెప్పను.. ఏం చేసుకుంటారో చేస్కోండి: డిగ్గీ రాజా సవాల్

తెలంగాణ పోలీస్ ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ వైపు ప్రోత్సహిస్తోందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తనపై కేసు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. తన ఆరోపణలు నిజమని, వాటిని రుజువు చేస్తే ముఖ్యమంత్రి రాజీ

క్షమాపణ చెప్పను.. ఏం చేసుకుంటారో చేస్కోండి: డిగ్గీ రాజా సవాల్
హైదరాబాద్ , బుధవారం, 3 మే 2017 (04:03 IST)
తెలంగాణ పోలీస్ ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ వైపు ప్రోత్సహిస్తోందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తనపై కేసు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పారు. తన ఆరోపణలు నిజమని, వాటిని రుజువు చేస్తే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరి మరింత కాక పెంచారు. దిగ్విజయ్ సడెన్‌గా ఈ వ్యవహారాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారన్నది ఇప్పుడు సంచలనం అయి కూర్చుంది. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటో ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. 
 
అసలు కారణం ఇదన్నమాట.  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బీసీ-ఇ కోటాలో ప్రస్తుతం వారికి అమలవుతున్న 4 శాతానికి మరో 8 శాతం కలిపి మొత్తం ముస్లిం రిజర్వేషన్ల కోటాను 12 శాతానికి పెంచింది. అది ఏమేరకు అమలు చేయగలుగుతుందన్న విషయం అటుంచితే.. ముస్లిం వర్గాల్లో టీఆర్ఎస్ పట్ల సానుకూలత పెరగడానికి ఈ చర్య ఉపయోగపడింది. మరోవైపు ఈ వ్యూహంపై అవగాహన లేని కొందరు టీ కాంగ్రెస్ నేతలు.. తాము మిర్చిపై పోరాడుతుంటే దిగ్విజయ్ అనవసరంగా ఐఎస్ఐఎస్ వ్యవహారాన్ని కెలికారని లోలోన మదనపడటం కొసమెరుపు.
 
సహజంగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఖాతాలోనే ఉందన్నది జగద్విదితం. రిజర్వేషన్ల పెంపు వ్యవహారంతో అదికాస్తా టీఆర్ఎస్ ఖాతాకు చేరుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ రంగంలోకి దిగింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రిజర్వేషన్ల వ్యవహారాన్ని రాజేసి హిందూ ఓట్ల పోలరైజేషన్ చేయాలన్నది కాషాయదళ వ్యూహం. ఆ దిశగానే బీజేపీ అడుగులు వేస్తోంది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనను కూడా ఖరారు చేశారు.
 
ఈ క్రమంలో కాంగ్రెస్ పరిస్థితి ఆటలో అరటిపండులా తయారైంది. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించలేక, అలాగని మద్దతిచ్చినా ప్రయోజనం పొందలేక.. ఆ పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముస్లిం యువతకు సంబంధించి దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రిజర్వేషన్ల వ్యవహారంలో ముస్లింలను గట్టి ఓటు బ్యాంకుగా మలుచుకున్నామనుకున్న టీఆర్ఎస్ ఆశలపై దిగ్విజయ్ వ్యాఖ్యలు నీళ్లు చల్లాయన్నది రాజకీయ వర్గాల భావన. దిగ్విజయ్ వల్ల ముస్లిం వర్గాల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పోగవటానికి అవకాశం ఉంటుందన్నది ఆ వర్గాల అంచనా. అందుకే ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం ముప్పేటా దాడికి దిగిందని చెబుతున్నారు.
 
ఇక తన తాజా వ్యాఖ్యలతో దిగ్విజయ్ సింగ్.. బీజేపీ జోరుకు చెక్ పెట్టారన్న భావన ఉంది. రిజర్వేషన్ల వ్యవహారంతో సీన్ అంతా బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లు మారుతున్న తరుణంలో దిగ్విజయ్ తన కామెంట్స్‌తో మొత్తం చిత్రాన్ని కాంగ్రెస్‌వైపుకు తిప్పుకున్నారు. ఐఎస్ఐఎస్ కామెంట్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయి. దీంతోనే దిగ్విజయ్ లక్ష్యం నెరవేరినట్లైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

500 కిలోల నుంచి 175 కిలోలకు తగ్గిస్తే వద్దు పొమ్మంటుందా