Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానం... జైరామ్ రమేష్ ట్వీట్

jairam ramesh

ఠాగూర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (13:51 IST)
హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల సరళిలో క్షణక్షణం ఉత్కంఠత నెలకొంది. ప్రారంభ ఫలితాల ట్రెండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనపరచగా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా దూసుకొచ్చింది. కౌంటింగ్‌ వేళ కొన్ని గంటల పాటు తీవ్ర ఉత్కంఠను కలిగించిన ఫలితాలు.. ఆ తర్వాత నుంచి కమలం జోరు కనిపిస్తుంది. ఫలితంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా పయనిస్తోంది.
 
అయితే, ఈ ఎన్నికల డేటాపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మందకొడిగా సమాచారాన్ని అప్‌డేట్ చేయడంపై విమర్శలు చేసింది. ఈమేరకు సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్ వేళ కూడా ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?" అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. 
 
మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ ఆలస్యంగా ఉండటాన్ని ఉద్దేశించి ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా అధికారులకు తక్షణం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దానిద్వారా హానికరమైన తప్పుడు వార్తలను కట్టడి చేయవచ్చని ఈసీకి తాను సమర్పించిన మెమోరాండంలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రీవెడ్డింగ్ షూట్ పేరుతో లిప్ లాక్ కిస్సులు... ఇది పోర్న్ వీడియో అంటూ నెటిజన్ల ఫైర్ (Video)