ఇటీవల హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. అయితే, ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి క్షణక్షణానికి మారిపోతుంది.,
ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా.. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. అటు జమ్మూకాశ్మీర్‌లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకెళ్తోంది.
కాగా, హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు కావాల్సివుంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు కాంగ్రెస్ 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఐఎన్‌ఎల్‌డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
అలాగే, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 28, పీడీపీ 4, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, భాజపా, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి.