Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ వలలో కాంగ్రెస్ విలవిల.. 2014 తర్వాత ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ’

బీజేపీ వలలో కాంగ్రెస్ విలవిల.. 2014 తర్వాత ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ’
, మంగళవారం, 16 జులై 2019 (08:41 IST)
134 ఏండ్ల కాంగ్రెస్​ పార్టీకి 39 ఏండ్ల బీజేపీ చుక్కలు చూపిస్తోంది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ తన ‘కాంగ్రెస్​ ముక్త్​’ ఆపరేషన్​ను​ మరింత వేగవంతం చేసింది. 2014 తర్వాత..  సొంతగా బలమున్న రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని కాంగ్రెస్​ విమర్శించినా, అడపాదడపా నిరసనలు చేసినా ఎమ్మెల్యేల జంపింగ్​లు మాత్రం ఆగడం లేదు. అసెంబ్లీకు సంబంధించి 2014 నుంచి ఇప్పటిదాకా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ విసిరిన వలలోపడి కాంగ్రెస్​ విలవిలలాడింది. అసలేం జరిగిందో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..
 
ఉత్తరాఖండ్...
2016 మార్చిలో అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీతో మిలాఖతై సీఎం హరీశ్​ రావత్​ను గద్దెదించే ప్రయత్నం చేశారు. నాటి గవర్నర్​ కేకే పాల్​.. బీజేపీకి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించినంత పని చేశారు. రాజీనామాకు నిరాకరించిన సీఎం రావత్​.. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. బలపరీక్షకు ఒక్కరోజు ముందు గవర్నర్​.. ఉత్తరాఖండ్​ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతో రావత్​ మళ్లీ సీఎం అయ్యారు. తొమ్మిది మంది కాంగ్రెస్​ రెబల్స్​పై అనర్హతవేటు పడింది. అయితే 2017 మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ నుంచి పోటీ చేసిన ఆ తొమ్మిది మంది భారీ మెజార్టీలు సాధించడం గమనార్హం.
 
మణిపూర్​...
2016లో అధికార కాంగ్రెస్​ పార్టీలో గ్రూప్​ తగాదాలు తారస్థాయికి చేరాయి. సీఎం ఓక్రం ఇబోబీ సింగ్​ను వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్​ లీడర్​ బీరేన్​ సింగ్ కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పి బీజేపీలో చేరారు. 2017 ఎన్నికల్లో 60 స్థానాలున్న మణిపూర్​ అసెంబ్లీలో బీజేపీకి 21 సీట్లు దక్కాయి. నార్త్​ఈస్ట్ డెమోక్రటిక్​ అలయెన్స్​(ఎన్​ఈడీఏ)లో భాగంగా చెరో నలుగురు ఎమ్మెల్యేలున్న నాగా పీపుల్స్​ ఫ్రంట్, నేషనల్​ పీపుల్స్​ పార్టీ, ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్​ జనశక్తి పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్​కు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం దక్కలేదు. బీరేన్​ సింగ్ జంప్​ అయిన కొద్ది రోజులకే 8 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. తర్వాత మరో 12 మంది కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
 
గుజరాత్...
మోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్​లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో(2017లో) బీజేపీకి కాంగ్రెస్​ గట్టిపోటీ ఇచ్చింది. 182 స్థానాల్లో 99 సీట్లు గెల్చుకుని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా, అల్పేశ్​ ఠాకూర్​ లాంటి కరిష్మా ఉన్న నేతలతో కాంగ్రెస్​(77 సీట్లు) బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. రెండేండ్లు తిరిగేలోపే కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పిన అల్పేశ్​.. బీజేపీలో చేరతానని ప్రకటించారు. ఆయనతోపాటు మరో 15 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలూ రెడీ అయ్యారు. దీంతో కాంగ్రెస్​కు అసెంబ్లీలో 50కిపైగా ఎమ్మెల్యేలున్నా,  లోక్​సభలో ఒక్క సీటూ దక్కలేదు.
 
అరుణాచల్​ ప్రదేశ్​...
2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్​ పార్టీ క్రైసిన్​ను ఎదుర్కొన్న మొదటి రాష్ట్రం అరుణాచల్​ప్రదేశ్. అక్కడి రాజకీయ అస్థిరత  రాష్ట్రపతి పాలన(2015–16) దాకా వెళ్లింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ 14 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలపై  నాటి స్పీకర్​ నంబమ్​ రెబియా అనర్హత నోటీసు జారీచేయడంతో డ్రామా మొదలైంది.  స్పీకర్​ నోటీసుని డిప్యూటీ స్పీకర్​ తోసిపుచ్చారు. దాంతో మ్యాటర్​ సుప్రీంకోర్టుకు చేరింది. వివాదంపై 2016, జులై 13న ఆదేశాలిచ్చిన కోర్టు.. జులై 16న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సూచించింది. అయితే బలపరీక్షకు కొద్ది గంటల ముందు సీఎం టుకీ  పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్​ రెబల్ ఎమ్మెల్యే పెమా ఖండూ సీఎం అయ్యారు. అంతా సద్దుమణిగిందనుకునేలోపే 2016, సెప్టెంబర్​ 16న ఖండూ మరో 43 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని పీపుల్స్​పార్టీ ఆఫ్ అరుణాచల్​లో చేరారు. అప్పటికే పీపీఏకి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత నెలరోజులకే ఖండూ అండ్​ టీమ్​ అఫీషియల్​గా బీజేపీలో చేరిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో బీజేపీ తొలిసారి అరుణాచల్​లో సర్కారు ఏర్పాటు చేసింది.
 
గోవా...
గోవాలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ చంద్రకాత్​ కవ్లేకర్​..10 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరి, ‘కాంగ్రెస్​ పక్షాన్ని’ విలీనం చేసినట్లు ప్రకటించుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరించిన కాంగ్రెస్​కు ఇప్పుడు ఐదుగురే ఎమ్మెల్యేలు మిగిలారు.
 
మహారాష్ట్ర...
ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ సీనియర్​ లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ జూన్​లో పార్టీకి గుడ్​బై చెప్పి, బీజేపీలో చేరిపోయారు. ఆయనకు సీఎం ఫడ్నవిస్ మంత్రిగానూ అవకాశం కల్పించారు. దానికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణ కొడుకు సుజయ్​ విఖే పాటిల్​ తాను ఆశించిన అహ్మద్​నగర్​ లోక్​సభ టికెట్​ దక్కని కారణంగా కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరి అదే సీటు నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్​ ఎమ్మెల్యే అబ్దుల్​ సత్తార్​ కాషాయ కండువా కప్పుకున్నారు. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్​ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సత్తార్ చెప్పారు.
 
కర్నాటక...
2018 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, అధికారానికి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. 78 మంది ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్​ పార్టీ, 37 మంది సభ్యులున్న జేడీఎస్​కు సపోర్ట్​ ఇవ్వడంతో కుమారస్వామి గౌడ ముఖ్యమంత్రి అయ్యారు. పట్టుమని 13 నెలలైనా తిరక్కముందే, కాంగ్రెస్​కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్​కు చెందిన ముగ్గురు పదవులకు రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడేలా చేశారు. ప్రస్తుతం స్పీకర్​ వద్ద పెండింగ్​లో ఉన్న రాజీనామాలు ఆమోదం పొందితే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 206కు పడిపోతుంది. అప్పుడు ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని బీజేపీ భావిస్తోంది.
 
ప్రస్తుతం...
కాంగ్రెస్​ లీడర్లు.. గోవా, కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందంటూ పార్లమెంట్​లో ఆందోళన చేస్తున్నారు. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లోనూ కాంగ్రెస్​ బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాలు నడిపిస్తున్నది. త్వరలోనే ఆ రెండు రాష్ట్రాలనూ తిరిగి కైవసం చేసుకుంటామని బీజేపీ చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు: బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య