దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ గుర్తించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను గుర్తించి, వారిని చేరదీసి, పెద్దపీట వేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్‌లో ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే పెట్టిందని తెలిపారు. అందుకు తన బృందంతో కలిసి వైయస్ జగన్‌ను అభినందించి, సత్కరించానని కృష్ణయ్య చెప్పారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ధైర్యం వైఎస్సార్‌సీపీ చేసిందని కొనియాడారు. పార్లమెంట్‌లో తొమ్మిది బీసీల పార్టీలు ఉన్నాయని, బీసీ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ లాంటి బీసీ పార్టీలు ఉన్నాలేనట్లేనని చెప్పారు. టీడీపీ బీసీల పార్టీ అని ప్రగల్బాలు పలకటమే తప్ప, బీసీలకు టీడీపీ చేసిన మేలు ఏమిలేదని విమర్శించారు. బీసీలను చంద్రబాబు తన అవసరాలకు మాత్రమే వాడుకున్నారని కృష్ణయ్య అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ బిల్లు పెట్టడానికి ముందుకు రాలేదని, ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చరిత్రకెక్కారని ఆయన ప్రశంసించారు. అందుకే దేశవ్యాప్తంగా బీసీ అభిమానాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ చూరగొన్నారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఒక్క వైఎస్ జగన్ మాత్రమే కనపడుతున్నారని అన్నారు.
50 శాతం ఉన్న బీసీలకు కేవలం 14 శాతం మాత్రమే రాజకీయ ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. 900 కులాల్లో ఎస్‌ఎస్‌సీ చదవని వారు ఉన్నారని, పారిశ్రామిక రంగంలో కూడా బీసీలకు ప్రాధాన్యతలేదని తెలిపారు. వీటన్నింటినీ సీఎం గుర్తించి, రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి వీలుగా తన వంతు కృషిగా పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టారని చెప్పారు.
సీఎం వైఎస్ జగన్, నిన్నటి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లపైగా బీసీలకు కేటాయించారని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలా జరగలేదన్నారు. బలహీన వర్గాలకు 4 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారన్నారు. మంత్రి వర్గంలో 60 శాతం బీసీలకు స్థానం కల్పించారన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అందరు చదవుకునే అవకాశాన్ని వైయస్.జగన్ కల్పిచారని కృష్ణయ్య పేర్కొన్నారు.