భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులుకానున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రస్తుతం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశారు.
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రోజు మే 14వ తేదీన నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ గవాయ్ నవంబర్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి చేపడుతున్న రెండో దళిత జడ్జి జస్టిస్ గవాయ్. ఆయన మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జిగా పనిచేసిన రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. బాంబే హైకోర్టులో 1987 నుంచి 1990 మధ్యకాలంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఫ్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.
2003లో హైకోర్టు అదనపు జడ్జి బాధ్యతలను స్వీకరించారు. 2005లో పూర్తిస్థాయి జడ్జిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.