వక్ఫ్ సవరణ చట్టం 2025ను ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉందని తెలిపింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. వందల ఏళ్లనాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని కేంద్రాన్ని ప్రశ్నించింది. వక్ఫ్ చట్టంపై నిరసనల సందర్భంగా హింస చోటుచేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది.
పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అలాగే, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, న్యాయవాది హుజేషా అహ్మదీలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లుపై విస్తృత చర్చ జరిపిందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.