దీపావళి పండుగ రోజున చెన్నై మహానగరానికి వాయుగుండం ముప్పు పొంచివుందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడం, మరోవైపు బంగాళా ఖాతంలో రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారనుండటంతో దీపావళి రోజున కుండపోతకు అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చెన్నై నగరంలో రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. బంగాళాఖాతంలో మాల్దీవులకు చేరువగా ఏర్పడిన అల్పవాయు పీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
ఈ అల్పవాయు పీడనం వాయుగుండంగామారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో గత 6వ తేదీన మరో కొత్త అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇలా రెండు అల్పవాయుపీడనాలు వాయుగుండాలుగా మారే అవకాశం ఉండటంతో దీపావళి నాడు రాష్ట్రమంతటా ఎడతెరపి లేకుండా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.