చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ముహుర్తం కుదిరింది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ వెల్లడించారు. ఇంతకు ముందుతో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దాని ద్వారా చంద్రుడి పైకి పంపనున్నట్లు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్‌ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.
వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు.. ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. యాత్ర మధ్యలో వ్యోమగాములకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకుని వచ్చే సామర్థ్యాలను ఇందులో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి అబార్ట్ మిషన్‌ను 2023 తొలినాళ్లలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.