బెంగుళూరు నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, గత నెల రోజుల్లో కుంభవృష్టి కురిసింది. ఈ కారణంగా బెంగుళూరు నగరం నీట మునిగింది. దీని నుంచి ఇపుడిపుడే ఈ నగరం తేరుకుంటుంది. ఇంతలోనే మరోమారు ఐటీ సిటీ నీట మునిగింది. బుధవారం రాత్రి బెంగుళూరు నగరంలో వర్షం కుమ్మేసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. ఇంకా వర్షం పడే సూచనలు ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీచేశారు.
బుధవారం కురిసిన భారీ వర్షానికి బెంగుళూరు నగరం మరోమారు బీభత్సంగా మారింది. నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా ప్రవహిస్తున్న వరద నీటికి సంబంధించిన వీడియోలు, వాహనాలు కొట్టుకునిపోతున్న వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు, వచ్చే మూడు రోజుల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా, గత నెలలో మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు కర్నాటక రాజధాని అస్తవ్యస్తంగా మారిన విషయం తెల్సిందే. వర్షపు నీరు ఇళ్ళలోకి చేరడంతో అనేక మంది హోటళ్లు, లాడ్జీల్లో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో గదులు అద్దెకు లభించకపోవడంతో అనేక మంది వరదనీరు తగ్గేంత వరకు పునరావస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇపుడిపుడే నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం మారు నగరంలో వర్షం కుమ్మేసింది.