నా హీరో చంద్రబాబు నాయుడు.. అబ్దుల్ కలాం ఆదర్శం.. : కమల్ హాసన్ (వీడియో)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే తన హీరో అని విశ్వనటుడు, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే తన హీరో అని విశ్వనటుడు, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం సాయంత్రం మదురై వేదికగా తన కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటి నుంచి తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టారు. అబ్దుల్ కలాం తనకు ఆదర్శమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ, తాను జాతిపిత మహాత్మా గాంధీకి వీరాభిమానినని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హీరో అని వ్యాఖ్యానించారు. 'నిన్న రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు సేవ చేసే విధానంపై సలహాలు, సూచనలు ఇచ్చారు' అని ఆయన వ్యాఖ్యానించారు. తన పార్టీ సిద్ధాంతాలపై చంద్రబాబు ఓ సూచన చేశారని చెప్పారు. ప్రజలకు చేయాల్సిన పనులు మనస్సులో ఉన్న వాటిని ఆచరణలో పెడితే అవే పార్టీ సిద్ధాంతాలవుతాయని చంద్రబాబు చెప్పారని కమల్ గుర్తుచేశారు.
సినిమాలకు, రాజకీయాలకూ తేడా ఉందని తాను భావించడం లేదని, రెండు రంగాలూ ప్రజల కోసమేనని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయాల్లో బాధ్యత కాస్తంత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను అంత్యక్రియలకు హాజరుకానుకాబట్టే కలాం అంత్యక్రియలకు రాలేదని చెప్పారు. ఆయన చదివిన పాఠశాలకు వెళ్లాలని భావించానని, కానీ స్కూల్ యాజమాన్యం అందుకు అనుమతించలేదని చెప్పిన కమల్, తనను అడ్డుకున్నారే తప్ప, ఆయన్నుంచి తాను నేర్చుకోవాలనుకున్న విషయాలను అడ్డుకోలేరు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అభిమానులు, ప్రజలు తమ గుండెల్లో తనను పెట్టుకున్నారని, ఇకపై వారింటి సభ్యుడిగా తాను మెలగుతానని భావిస్తున్నట్టు చెప్పారు.