హిమాలయాల్లో ఉన్న ఒక యోగితో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ యోగితో షేర్ చేసుకున్నందుకుగాను ఆమెను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. 59 యేళ్ల చిత్ర రామకృష్ణన్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఈమె 2013-16 మధ్యకాలంలో ఎన్.ఎస్.ఈకి సీఈవోగా పని చేశారు ఆ సమయంలో ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ఒక యోగితో షేర్ చేసుకున్నారు. అదీ కూడా ఈమెయిల్ ద్వారా షేర్ చేశారు.
అయితే, ఆ యోగి ఎవరో కాదు... ఎన్.ఎస్.ఈ మాజీ ఉద్యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యమేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల ఆరంభంలోనే అరెస్టు అయిన విషయం తెల్సిందే.
2010-15 మధ్య కాలంలో ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈ సమాచారాన్ని 2014-16 మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తితో చిత్రా రామకృష్ణన్ ఈమెయిల్ ద్వారా షేర్ చేసినట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించింది. దీంతో ఆమెను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.