ఆర్కే నగర్ ఓటర్లకు నగదే కాదు.. టోపీలు, స్కార్ఫ్‌లు, ల్యాంపులు, చీరలు.. పాలు, రీచార్జ్ కూపన్లు ఇలా...
చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఈనెల 12వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, ఓటర్లకు పెద్ద
చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఈనెల 12వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉండగా, ఓటర్లకు పెద్దఎత్తున నగదు, బహుమతులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలింగ్‌కు సరిగ్గా మూడురోజుల ముందు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
దివంగత జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఈ సెగ్మెంట్‌లో మొత్తం 2.6 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పేద ప్రజలు, దినకూలీలే. వీరంతా దినకరన్‌కు ఓట్లు వేసేలా, వారిని ప్రలోభపెట్టేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా మంత్రులు విజయ్ భాస్కర్, దిండిగుల్ శ్రీనివాసన్, కేఏ సెంగోట్టయ్యన్, డి. జయకుమార్‌లతో పాటు మొత్తం 16 మందికి నిర్దేశిత లక్ష్యాలను అప్పగించి డబ్బులు కూడా పంపిణీ చేశారు. ఫలితంగా ఒక్క ముఖ్యమంత్రికే మొత్తం ఏకంగా 33 వేల మంది ఓటర్లకు రూ.13.27 కోట్లు పంచినట్టు పత్రాలు బయటపడ్డాయి.
ముఖ్యంగా.. ఒక్కో ఓటరుకు రూ.4 వేల నగదుతో పాటు.. ఫోన్ రీచార్జ్ కూపన్లు మొదలు, పాల టోకెన్ల మొదలుకుని టోపీలు, స్కార్ఫ్‌లు, ల్యాంపులు, చీరలు ఇలా ఏది కావాలంటే అది బహుమతులుగా ఇచ్చినట్టు ఈసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆర్కేనగర్ ఉపఎన్నికను వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఈ నిర్ణయం దినకరన్ వర్గీయుల నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టుగా మారింది.