Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్ కానిస్టేబుల్ రాత పరీక్ష

exam
, ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (09:54 IST)
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్‌) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షను ఇక నుంచి హిందీ, ఇంగ్లీష్‌తోపాటు ఇకమీదట తెలుగు సహా కొత్తగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శనివారం ఆ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది.
 
కాగా, ఇప్పటివరకు జరుగుతున్న హిందీ, ఇంగ్లీష్‌తోపాటు అస్సాం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాదిమంది యువకులు తమ సొంత భాషల్లో పరీక్ష రాసి, తమ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలవుతుందని హోంశాఖ అభిప్రాయపడింది. 
 
జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ నియామకాలకోసం స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. వీరందరికీ మొత్తం 15 భాషల్లో 2024 జనవరి 1న పరీక్ష నిర్వహించనుంది. ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఆసక్తిగల యువత పరీక్షకు దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని కేంద్రహోంశాఖ సూచించింది. 
 
కాగా, సీఏపీఎఫ్‌ పరీక్షలను తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు శనివారం ట్విటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు