కరోనా వైరస్ బారినపడి మృత్యువాతపడిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు స్పష్టతనిచ్చింది. పైగా, కరోనాతో చనిపోయిన వాళ్లందరి కుటుంబాలకు నాలుగేసి లక్షలు ఇస్తే కొవిడ్ సహాయక నిధులు సరిపోవని తెలిపింది.
సహాయక చర్యలకు కనీస ప్రమాణాలు, చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కోరుతూ దాఖలైన పిల్‌కు సంబంధించి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందని, కొవిడ్ బాధితులకు రూ.4 లక్షలు ఇవ్వడం కుదరదని అఫిడవిట్‌లో కేంద్రం తేల్చి చెప్పింది.
ఇండియాలో కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకూ 4 లక్షల మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత మందికి ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ఇవ్వాలంటే మొత్తం ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు దీనికే ఖర్చయిపోతాయి.
మిగతా వాటి కోసం మరింత భారీగా వెచ్చించాల్సి వస్తుంది అని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అత్యవసర మందులు, ఇతర కొనుగోళ్లతోపాటు తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతుందని స్పష్టం చేసింది.
కొవిడ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువల్ల ఇతర విపత్తుల విషయంలో తీసుకునే కనీసం సహాయ ప్రమాణాలు, పరిహారం ఇవ్వడం కుదరదని కేంద్రం అభిప్రాయపడింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2019-20లో కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రాలకు అదనంగా రూ.1113.21 కోట్లు విడుదల చేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.