హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని పడక గదిలోకి ఓ అవు, ఎద్దు దూసుకొచ్చాయి. దీంతో బెంబేలెత్తిపోయిన ఓ మహిళ ఇంట్లోని కప్‌బోర్డులోకి వెళ్లి దాక్కుంది. ఆ ఆవు, ఎద్దును బయటకు పంపేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అవి బయటకు పోలేదు. దీంతో ఆ మహిళ సుమారు రెండు గంటల పాటు కప్ బోర్డులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
డబువా కాలనీలోని సీ బ్లాక్‌లోని ఓ ఇంట్లో రాకేష్ సాహూ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని పడక గదిలోకి ఆవు, ఎద్దు దూసుకొచ్చాయి. ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రాకేష్ భార్య ఇంట్లోని గదిలో పూజ చేస్తుండగా, అకస్మాత్తుగా ఒక ఆవు, ఎద్దు నేరుగా బెడ్రూమ్‌లోకి రావడంతో భయపడి పరుగెత్తి, కప్‌బోర్డులో దాక్కుంది.
ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చేందుకు దాదాపు రెండు గంటల పాటు సాయం కోసం అరిచింది. అయితే, అవు, ఎద్దు మాత్రం పడక గదిలోని మంచంపైకి ఎక్కడంతో ఆమె బయటకు రాలేకపోయింది. చివరకు ఇరుగుపొరుగువారు వచ్చి వివిధ రకాలైన ప్రయత్నాలు చేసినా అవి బయటకు రాలేదు. పొరుగున ఉండే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకొచ్చి బిగ్గరగా అరిచేలా చేయడంతో ఆవు, ఎద్దు భయపడి బయటకు వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.