ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం హాజరుకావలంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ కేసులో గత యేడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు కవితను ఈడీ అధికారులు వించారించారు. తాజాగా మరోమారు నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు జారీచేసింది.
కానీ, ఆయన మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 18వ తేదీన విచారణకు రావాలంటూ మరోమారు అంటే నాలుగోసారి నోటీసులు జారీచేసింది. అయితే, తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ మరోమారు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఇదిలావుంటే ఈడీ నోటీసులపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెల్సిందే.