సోషల్ మీడియా వేదికగా పరిచయమైన తన స్నేహితుడుని చూసేందుకు బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ చివరకు అతని చేతిలోనే అత్యాచారానికిగురైంది. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే కైలాశ్ అనే యువకుడుకి బ్రిటన్‌కు చెందిన ఓ మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. దీంతో అతన్ని చూసేందుకు ఇటీవల భారత్‌కు వచ్చింది. మహిపాల్ పూర్‌లోని ఒక హోటల్‌లో గదిని బుక్ చేసుకుంది. ఆమెను కలిసేందుకు వచ్చిన కైలాశ్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరో స్నేహితుడుతో కలిసి ఆమెపై లైంగికదాడికి తెగబడ్డాడు. వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ... పోలీసులను ఆశ్రయించింది. తొలుత కైలాశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అక్కడి నుంచి తప్పించుకుని రిసెప్షన్ వద్దకు చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కిన తనను అతని స్నేహితుడు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
కాగా, భారత్‌కు వచ్చిన బ్రిటన్ మహిళ తొలుత గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించింది. తన స్నేహితుడు కైలాశ్‌ను కూడా తనతో రమ్మని పిలిచింది. అయితే, తాను అక్కడకు రాలేనని చెప్పడంతో ఆ మహిళే ఢిల్లీకి రాగా, ఈ దారుణం జరిగింది. ఈ ఘటనను భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఇటీవల కర్నాటక రాష్ట్రంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న విషయం తెల్సిందే.